ముందుగా మీతో నేను...
అంతర్జాతీయ స్థాయి తెలుగు రచయిత-పాలగుమ్మి
గత సంవత్సరం సరిగ్గా ఇదే రోజు... అంటే 24 జూన్ 2014 నాడు తెలుగురథం కొంపెల్లె శర్మ, ''పాలగుమ్మి పద్మరాజుగారి శతజయంతి జరుపుతున్నాను, దాంట్లో మాట్లాడాల్సిన ఓ వ్యక్తి హఠాత్తుగా రానన్నారు. దయచేసి మీరు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను'' అనడంతో ఆ సభలో పాల్గొనడం జరిగింది.
ఆ సభలో మాట్లాడ్డానికి ఒకసారి పాలగుమ్మివారి రచనలన్నీ తిరగవేసేటప్పటికి ఆయన విశ్వరూపం కంటిముందు మెదిలింది. ఆ సభలో మాట్లాడినా ఇన్ని విషయాలు అందరికీ చెప్పలేం... చెప్పినా కొంతమందికే చెప్పగలం అన్న విషయం అర్థంకావడంతో అన్ని ప్రాంతాల్లోనూ ఆయన శతజయంతి సభలను నిర్వహించి, ఆయన సాహితీ బహుముఖీనతని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో కూడా శతజయంతి సభల్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. దీనికి నాకు తెలుగు రథంతోపాటు ఎన్నో స్థానిక సంస్థలూ సహకరించాయి. వాళ్ళందరికీ ముందుగా నా కృతజ్ఞతలు.
ప్రతీ ప్రాంతంలోనూ పాలగుమ్మి పద్మరాజుగారిని ఆత్మీయంగా తలచుకోవడం చాలా గొప్ప విషయం. అలాగే ప్రభుత్వం 'అంతర్జాతీయ స్థాయిలో తెలుగు బావుటా'ని ఎగురవేసిన ఆ తెలుగు సాహితీవేత్తని రాష్ట్రవ్యాప్తంగా కాదుకదా, కనీసం ఆ జిల్లావ్యాపితంగా కూడా సంస్మరణ సభలు జరగకపోవడంతో సాహితీవేత్తలు కలతచెంది, ప్రభుత్వాన్ని పద్మరాజుగారి శతజయంతిని నిర్వహించమని కోరడం జరిగింది. ఆ కోరడం అరణ్యరోదన కావడం దురదృష్టం.
అయినా, దురదృష్టాన్ని తిట్టుకుంటూ కూర్చోకుండా తెలుగు సాహితీవేత్తలు, అభిమానులు పెద్దెత్తున ఈ శతజయంతి సభలో వారిని సంస్మరించుకోవడం, స్ఫూర్తి పొందడం గొప్ప విషయం.
పాలగుమ్మి పద్మరాజుగారు సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ లేదు. ఛందోబద్ధకవిత్వం, వచనకవిత్వం, కథానికలు, నవలలు, విమర్శావ్యాసాలు, రేడియో నాటికలు, స్టేజి నాటకాలతోపాటు చలన చిత్రాలకు రచన, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రచించారు. రెండు చిత్రాలకి దర్శకత్వం వహించారు. చలనచిత్రసీమలో ఎందరికో వెన్నెముకగా నిలిచారు.
శతజయంతి సభల గురించి మర్చిపోవచ్చు. కాబట్టి ఆయన గురించిన అన్ని విషయాలని ఈ సందర్భంలో రికార్డు చేస్తే ఆయన శతజయంతి తర్వాతి తరాలవారికీ గుర్తుంటుంది, ఆయన సాహితీమూర్తంత్వమే కాదు, రేడియో చలనచిత్రాలకి చేసిన సేవ, ఆయన వ్యక్తిత్వం, ఆయన లోతులు కూడా తెలిసేటట్లు ఆయన ఆత్మీయులు, కుటుంబసభ్యులు, అభిమానులు, సాహితీవేత్తలు, చలనచిత్ర ప్రముఖులు రాసిన విభిన్న విషయాల్ని ఈ ప్రత్యేక సంచికలో పొందుపరుస్తున్నాం. ఇది ఒక విధంగా రేఖామాత్రంగా పాలగుమ్మివారిని పరిచయం చేస్తుంది. ఆయన గురించి పూర్తిగా తెలియాలంటే ఆయన రచనలన్నీ చదవాల్సిందే, చలనచిత్రాలన్నీ చూడాల్సిందే. రేడియో నాటకాలన్నీ వినాల్సిందే!
పాలగుమ్మి పద్మరాజుగారికి సమకాలీనులైన బుచ్చిబాబుగారంటే కథారచయితగా ఇష్టం. ఆయనకీ ఇష్టమైన కథానికా రచయిత పాలగుమ్మి పద్మరాజు. ఈ ప్రత్యేక సంచికలో పాలుగుమ్మి పద్మరాజుగారు, బుచ్చిబాబుగారి 'చివరికి మిగిలేది' నవలమీద రాసిన ప్రత్యేక వ్యాసం, ఆయన రేడియోకోసం నాటకీకరణ చేసిన 'చివరికి మిగిలేది' నాటకం కూడా దీంతో పొందుపరుస్తున్నాం. పాలగుమ్మి పద్మరాజుగారి శతజయంతి ముగుస్తున్న సందర్భంలోనే బుచ్చిబాబుగారి శతజయంతి ప్రారంభం కావడం విశేషం.
ఆయన దృష్టే భిన్నం. అందుకే ఆయన రచనలు భిన్నం. ఆయన ప్రత్యేకత ఆయనకుంది. ఆ ప్రత్యేకత మనందరికీ తెలియాల్సిన అవసరమూ ఉంది. ఈ ప్రత్యేక సంచికలో ప్రచురించిన వ్యాసాలను రాసిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. దీనిని ఇంత అందంగా, చక్కటి సమాచారంతో మీముందుకు రావడానికి సహకరించిన శ్రీమతి పాలగుమ్మి సీత, శ్రీ కొంపెల్లె శర్మలకు కృతజ్ఞతలు. సకాలంలో డి.టి.పి.చేసిచ్చిన మిత్రులు కుడుపూడి భాస్కర్‌రావుగారికి (మను గ్రాఫిక్స్) , ప్రచురించిన వేణు గ్రాఫిక్స్‌కి కూడా నా కృతజ్ఞతలు.
అందరికీ సాహిత్యాభివందనాలు.
మీ
వేదగిరి రాంబాబు
24-06-2015