ముందుమాట
తెలుగు పాఠకదేవుళ్ళందరికీ నమస్కారాలు.
గురజాడవారి 150వ జయంతి సందర్భంగా 'నివాళి'గా ఈ చిరు గ్రంథాన్ని తెస్తున్నాను. గురజాడవారి గురించి కొన్ని వివరాలనైనా ఈ చిరుగ్రంథం ముందుతరాలవారికి అందించగలదని ఆశ. గురజాడవారి గురించి ఇంతకు ముందు ఎన్నో గ్రంథాల్ని ఎంతోమంది రాశారు. వాళ్లందరికీ నా నమస్కారాలు. ఆ రచనలను చదివిన తర్వాత ఆయన బంధువులతో మాట్లాడిన తర్వాత ఈ ధైర్యం చేయగలిగాను. రచయితకు వ్యక్తిత్వం, నిబద్థత ఎంత ముఖ్యమో-అటువంటి రచయితల చేతుల్లో సాహిత్యం ఎంత ప్రయోజనాన్ని సాధించగలదో గురజాడ వారి జీవితం మనకు చెప్పకనే చెబుతుంది. గురజాడవారి ఇంట్లో- విజయనగరంలో-గురజాడ 150వ జయంతుత్సవాల సందర్భంగా - ఈ చిరు గ్రంథం ఆవిష్కరణ జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ చిరుగ్రంథం చివర్న గురజాడవారి ఇంట్లో వున్న, వారు చదివిన గ్రంథాల పట్టికలను కూడా జతపరుస్తున్నాము.
అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, శలవ్-