Book

కథావరణం

విహారి,

Book
ప్రస్తావన  
   
  గత వెయ్యేళ్లల్లోనూ ఎన్నడూ లేనంతగా ఘోరమైన విపత్కర పరిస్థితిలో దుఃఖిస్తున్నాయట - పంచభూతాలు! ప్రకృతిని జయించాలనే (అతి) తెలివితో, మితిమీరిన ఆరాటంతో - పంచభూతాల్నీ ఒడిసిపట్టి కలుషితం చేసేస్తూ, పర్యావరణ సమతుల్యతని నాశనం చేస్తూ - మనిషి - తనను తాను ప్రమాదాల్లోకి నెట్టేసుకుంటున్నాడు. అడవుల్ని నరికేయటం, ఖనిజాల్ని దోచేయటం, నీటిని తోడేయటం, గాలినీ కుమ్మేయటం - చెయ్యన దుర్మార్గం లేదన్నట్టు పేట్రేగి పోతున్నాడు. భూమిమీద నానారకాల దాడుల్నీ కొనసాగిస్తున్నాడు! ఆహార కొరత, నీటి ఎద్దడి, దూళిగామారిన గాలి - అన్నీ మానవమనుగడని ప్రశ్నార్థకం చేస్తున్న అవాంఛనీయ పరిణామాలే! నిప్పునీ తిన్నగా నిలవనీయటం లేదు (బ్లాస్ట్‌ ఫర్నెస్‌లు పేలిపోతున్నై)! జీవ వైవిధ్యాన్నీ, జీవన విధానాన్నీ - శోషణం చేసేసుకుంటున్నాడు - మనిషి!
  ఇదంతా, ప్రశాంతచిత్తుల గుండెల్ని పిండేసే వర్తమాన దౌర్భాగ్య చిత్రం. దీని కొనసాగింపుని చూడగలుగుతున్న దార్శనికులు - భవిష్యత్‌ దృశ్యం మరింత దుర్భరంగా వుంటుందని నిష్కర్షగా చెబుతున్నారు.
  ఇది ఛిద్రజీవన సమాజ పార్శ్వం అయితే, దీనికి కారకుడైన మనిషీ సమాజంలో వాడే. అందుకని ఆ ఛిద్ర జీవన విషాదాన్ని తానూ అనుభవిస్తున్న దురదృష్ట జీవి అయ్యాడు!
  అటు ఆ సమాజమూ, ఇటు ఈ మనిషీ మధ్య జరుగుతున్న సంఘర్షణ బహిరంతర సంక్లిష్టతలకీ, సంకీర్ణతలకీ, అస్తవ్యస్తతలకీ కారణమవుతుంది. వీటన్నిటి (రోగ) లక్షణాల్నీ పసిగట్తూనే వుంటుంది సాహిత్యం. పసిగట్టి, ఆరోగ్యకరమైన, హితకరమైన హెచ్చరికల్ని చేస్తూ వుంటుంది. ప్రశాంతమైన సమసమాజ పునరుజ్జీవనానికి అవసరమైన ఆచరణ ప్రణాళికల్నీ - కళాత్మక వాస్తవికతతో సూచిస్తుంది.
  మనిషిని 'ఉన్నస్థితి' నుంచీ 'ఉన్నతస్థితి'కి సంస్కరించే శక్తివంతమైన సాహిత్య ప్రక్రియగా కథ కూడా ఈ బాధ్యతని నిర్వహిస్తోంది.
  పర్యావరణ పరిరక్షణలో రెండు ముఖ్యమైన పార్శ్వాలున్నై. ఒకటి - ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాన్ని నిలవరించటం. రెండు - రాబోయేపరిణామాల్ని నివారించే చర్యలు తీసుకోవటం.
  తెలుగుకథకులు చాలామంది - పర్యావరణ పరిరక్షణలోని ఈ రెండు పార్శ్వాల్నీ స్పృశిస్తూ, మొత్తం ఆ ఆవరణం పరిధిలోని విభిన్న ఇతివృత్తాల్నీ - ఎక్కువ శాతం - కథాగతం చేశారు.
  పర్యావరణం మీద కథాసంకలనాన్ని ఆలోచించి, ప్రకటన ఇచ్చి, కథల్ని ఆహ్వానించాం. స్పందన ఆశాజనకంగానే వుంది. వచ్చిన వాటినుంచీ కొన్నిటిని ఎంచుకునే కష్టసాధ్యమైన పనిని మా పరిమితుల మేరకు మేము నిర్వహించాము. వస్తు శిల్పాల మేలు కలయిక అనదగిన కథల్ని ఎన్నుకున్నాము. అవి కాక, విడిగా మా దృష్టికి వచ్చిన మంచికథల్నీ, కొందరు సాహితీ మిత్రులు సూచించిన మంచి కథల్నీ- ప్రత్యేకశ్రద్ధతో చదివి, వాటినుంచీ కూడా కొన్నిటిని తీసుకున్నాము. కథల ఎంపికలో - వస్తు వైవిధ్యం, కథాకథన నైపుణ్యం - ఈ రెంటినీ దృష్టిలో పెట్టుకున్నాము.
  ఈ సంపుటిలోని 20 కథల్లో వస్తువులో వినూత్నత, లేదా కథా సంవిధానంలో ప్రత్యేకత, లేదా కథనంలో విలక్షణత గోచరిస్తాయి. ఒకే వస్తువు మీద రెండు మూడు కథలు వచ్చినప్పుడు, ఎంపిక చేసుకున్న కథల్లో పైన చెప్పిన ప్రత్యేకతో, విలక్షణతో ప్రస్ఫుటంగా తోచటాన వాటిని స్వీకరించటం జరిగింది.
  ఛిద్రమైపోతున్న పల్లె నైసర్గిక స్వరూపం, ఆనవాలు లేకుండా పోతున్న చెరువుల మీద రెండు కథలున్నై. (ముసలమ్మమరణం, చెరువు.) చెట్టును సంరక్షించుకోవలసిన ఆవశ్యకత, లేకుంటే జరిగే విధ్వంసం మూడు కథల్లో చూస్తాం (సృష్టికర్త ఆవేదన, అమ్మ చెట్టు, మురళి ఊదే పాపడు). భూమి అమ్మకపు సరుకుగా మారిపోతే మనుషులు 'పిచ్చి' కలలే కంటారు. లేకుంటే నిలువునా, పశువుల్నీ అమ్ముకుని చరమాంకంలో పడతారు. (ఆకుపచ్చని కల, భూమి పుండు). అంతరించి పోతున్న పక్షిజాతికి పునరుజ్జీవనం కల్పించకుంటే? జవాబువున్న ప్రశ్ననే సంధించారు కథకులు (హంసగీతం, చివరి పిచ్చుక). ఏనుగుల మీద మనిషి దాడిని నిరసిస్తుంది (గజం మిథ్య....పలాయనం మిథ్య) ప్లాస్టిక్‌ విషాన్ని తిన్న మేక ఎవరెంతటి అనుబంధంతో ఏడ్చినా బతుకుతుందా? (విషం). హైబ్రిడ్‌ విత్తనాల దుష్ప్రభావాన్ని ధ్వనిమంతంగా కథామయం చేసింది (అధిగమనం). సంప్రదాయ వైద్యవిద్య ప్రాధాన్యత, ఔషదీయమొక్కల పెంపకం ఆవశ్యకతని చూపించింది (నెమలినార). ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్తుల దుర్భరజీవిత క్షణాలకి వాస్తవిక, పరిశోధనాత్మక చిత్రణ (ఒక సామూహిక మరణదండన). ఇల్లూవాకిలీ భూమీ పుట్రా ఆనకట్టల పాలయితే, ఫ్యాక్టరీల పరమయితే మానవ సంబంధాల్లో కలిగే వ్యధలూ, బాధామయ పరిణామాలూ, రైతు ఆత్మహత్యలూ ఆలోచనా ప్రేరకంగా తయారవుతాయి. (ఆనకట్ట, కంకాళం) సహజ వనరుల్ని కాపాడుకోలేకపోతే నీటిచుక్కల్ని కొనుక్కోవలసిన దురవస్థే దేశపటం ముందున్నది. (అమూల్యమైనవి). కిన్నెరసాని కాస్తా కాలుష్యపు దాడితో బూడిదసానిగా మారితే, అక్కడి మత్స్యకారుల జీవికకి విఘాతమే కదా కలిగేది (ఉమ్మెతపూలు). ఒక ఆదర్శ పర్యావరణ ప్రపంచ నిర్మాణాన్ని ఊహల్లో స్వప్నించినా, మనుషుల్ని భౌతిక వాస్తవాల దుర్మార్గాలు వెంటాడుతూనే వుంటాయనే సత్యానికి శిల్పీకరణం (పర్యావరణవేత్త). 'మమకారాలకేమొచ్చింది? మనుషులకన్నా మాన్లెక్కువ కావు'... 'బయట చెట్లకుండే గిరాకీ ఊళ్ళో మన పొలాలకు లేదు' 'చెట్లను ఏ రైతూ నాశనం చేసుకోడు' .... ఈ ఆర్థికావశ్యకత కోణాన్ని చిత్రించింది. ('ఒక దృశ్యం : మరొక చిత్రం')
  ఈ సంకలనంలోని రచయితలందరూ కథారచన పట్ల ఆరాధనా భావం కలిగిన సృజనశీలురు. పర్యావరణ విధ్వంసానికి కనుచెమరింపూ, దాని పరిరక్షణకి చిత్తశుద్ధీ వున్నవాళ్ళు అని ఈ కథలు తెలియజేస్తున్నాయి.
  ఈ సందర్భంలో ఒక అప్రియసత్యం గురించి కూడా చర్చించుకోవాలి. పర్యావరణం అనే పార్శ్వంలో మనిషి ఇంతవరకు సముపార్జించిన జ్ఞాన శాఖలన్నీ ముడిపడి ఉన్నాయి. అందువల్లనే పర్యావరణాన్ని కేవలం విజ్ఞానశాస్త్రంగానో, సామాజిక శాస్త్రంగానో పరిమితం చేయలేం. పర్యావరణం సంబంధించి ప్రపంచస్థాయిలో సాగుతున్న ఆలోచన ఏమిటంటే - మానవుడు ఈ ప్రపంచాన్ని చూసే దృక్కోణంలోనే పర్యావరణ అనుకూల దృష్టి ఉండాలని. తదనుగుణంగా మొత్తం ప్రపంచాన్నీ, సమాజాన్నీ మనం పరిణించే విధానం మారాలి. ఇది పర్యావరణ తాత్విక పంథా. మనిషి కోసం మొత్తం సృష్టి రూపొందించబడలేదు. మనిషి ఎన్నోరకాల జీవులలో ఒక జీవి మాత్రమే అనే ఎరుక చాలా అవసరం. మరి మన సారస్వతం ఆస్థాయిలో రూపొందబడే రీతిలో ఉందా? దానికి చోదకశక్తులు అయిన రచయితల సమాయత్త స్థాయి ఎలా ఉంది? ఈ కోణం నుంచి చూసినపుడు తెలుగు కథ అంత తృప్తి కలిగించదు. పర్యావరణం సంబంధించి మరెన్నో కోణాలు ఇంకా తెలుగు కథా వస్తువు కావాల్సి ఉంది. అలాగే స్వీకరించిన కథావస్తువు సంబంధించి సైతం సమగ్రమైన అవగాహన కొరవడిందనిపిస్తుంది. ఇక్కడ అనుషంగికంగా యింకో విషయం కూడా ముచ్చటించుకోవాలి. వస్తుపరమైన పరిచయం, అవగాహన వీలయినంత సమగ్రంగా ఉంటే - అందుకోబోయే శిల్పం మరింత అర్థవంతంగా, ఔచితీమంతంగా రూపుదిద్దుకుంటుంది. కేవలం వార్తాపత్రికల సమాచారంతో స్ఫూర్తి చెంది అమాంతంగా కథ సృజిస్తే అది సంక్లిష్టమైన పర్యావరణ దృశ్యాన్ని సమగ్రంగాప్రతిఫలించదు, సమాజంలో చైతన్యస్పృహను పెంచి క్రియోన్ముఖులను చేయదు! ఈ 'కథావరణం' సందర్భంలో గమనించిన ఈ విషయం కేవలం ఈ సంకలనానికే వర్తిస్తుందని భావించనక్కరలేదు. ఎంపిక చేసుకోలేని కథలనూ, ఇతరత్రా ప్రక్రియలనూ పరిశీలించి చెబుతున్న కీలక విషయమిది. పర్యావరణ తాత్వికత పెంపొందడానికి మేము చేసిన ప్రస్తుత ప్రయత్నం వంటివి ఎంతో కొంత దోహదపడతాయని మా విశ్వాసం.
  ''జీవిత సత్యాలు కళల ద్వారా సార్వజనీన మవుతాయి'' అంటారు కొ.కు. వర్తమాన సామాజిక వాస్తవాల్ని ఈ కథకులంతా తమ రచనల ద్వారా సార్వజనీనం చేయటానికి ప్రయత్నించారు. వారి ఆ ప్రయత్నాన్ని సంకలన రూపంలో మీకందిస్తున్నాము. ఈ కథానికలు ఆలోచనా ప్రేరకంగా ఉద్దిష్ట ఫలితాన్ని పొందుతాయని ఆశిస్తున్నాము. చదవండి.
  ఈ సంకలనంలో తమ తమ కథల్ని ప్రచురించడానికి అంగీకరించిన ప్రతి ఒక్క రచయితకూ ధన్యవాదాలు. కథానికల్ని సూచిస్తూ తమ ప్రోత్సాహాన్ని పరోక్షంగా అందించిన సాహితీమిత్రులకు అభివందనాలు. 'మీరు సంకలనం చేయండి, మేము పుస్తకం వేస్తాము' అని 'చే'యిచ్చిన పెద్దలకు ఒక నమస్కారం. ఈ సంకలనాన్ని 'చినుకు' ప్రచురణగా వెలువరించడానికి తమ సహకార హస్తాన్నందించిన శ్రీ రాజగోపాల్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని అందంగా డీటీపీ చేసి ఇచ్చిన మనుగ్రాఫిక్స్‌వారికి ధన్యవాదాలు.
  పర్యావరణ కథల్ని సాహితీలోకం ఆదరిస్తుందనే ఆకాంక్షతో...
  విహారి
  డా|| నాగసూరి వేణుగోపాల్‌
Read Book

కథావరణం

Publication Date: Feb 02, 2010

Publisher: వేణు గ్రాఫిక్స్‌

Edition: 2010

Language: Telugu

Pages: 239

 
 
 
This is Terms and conditions page description
This is product content page description
This is privacy policy page description
The Publisher of this website makes every effort to be as accurate and complete as possible in the creation and curation of the content published on this site. However, Publisher does not warrant or represent at any time that the contents within are accurate due to the rapidly changing nature of the Internet. The Publisher will not be responsible for any losses or damages of any kind incurred by the reader whether directly or indirectly arising from the use of the information found on this website. The authors and Publisher reserve the right to make changes without notice. The Publisher assumes no responsibility or liability whatsoever on the behalf of the reader of this website. No part of the content available in the website may be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording or by any information storage and retrieval system, without written permission. This website is not intended for use as a source of legal, health, business, accounting or financial advice. All readers are advised to seek services of competent professionals in the legal, health, business, accounting, and finance fields. There are no representations or warranties, express or implied, about the completeness, accuracy, reliability, suitability or availability with respect to the information, products, services, or related graphics contained in this website for any purpose.