ఇన్నేళ్ళకు మళ్లీ మీ ముందుకు....
1995 జూలై వరకూ ఎంతో ఉధృతంగా రచనలు చేశాను. కథలు, కవితలు, సాహిత్యవ్యాసాలు, 'తెలుగు కథ-తేజోరేఖలు' విశ్లేషణలు! అయితే, ఆ తర్వాత చిత్రంగా 2006 నవంబరు వరకూ (ఒక్క కథ తప్ప) పత్రికలకు ఎలాంటి రచనా పంపలేదు. ప్రవాసాంధ్ర జీవితం, ఉద్యోగ బాధ్యతలు. 2006 డిశంబరులో డా|| వేదగిరి రాంబాబు సమన్వయకర్తగా డి.డి. (సప్తగిరి టీ.వీ) వారి కథానికా రచన చర్చలో, వారి ప్రేరణతోనే పాల్గొనటం ఒక మలుపు. ఆంధ్రప్రభ సంపాదకులు విజయబాబుగారు, మునిపల్లెరాజు గారు ఆ చర్చలో ఇతర వక్తలు. ఆరోజు రాంబాబు 'ఇంతకాలం మీరిలా కథా సన్యాసం చేయటం బాగాలేదు సార్' అని కాస్త కినుకతోనూ, చనువుతోనూ, మనస్ఫూర్తిగానూ మందలించారు. 1990-95ల్లోనూ నా రచనా కార్యక్రమానికి ఆయనే catalyst మరియు Inspiring force. ఆయనొక One man Army-కథా ప్రాచుర్యానికి సంబంధించి! కథానికకు అంకితమైన గొప్ప రచయిత. ఆయనకి నేనంటే గౌరవం అనేకంటే-మావంటి సీనియర్స్ కథారచనని వదిలేయకూడదనే ఆరాటం, ఆకాంక్ష ఎక్కువ!
నేను ఆలోచనలో పడ్డాను. 1995 వరకూ రాసిన 'తెలుగు కథ- తేజోరేఖలు' గురించి విజయబాబు గారితో ప్రస్తావించాను. ఎంతో సౌజన్యంతో, ఠక్కున 'ఇప్పుడు ఆంధ్రప్రభలో శీర్షికగా వేద్దాం. మొదలెట్టండి' అన్నారు. ఆ తర్వాత వారం నుంచే ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం పుస్తకంలో ఆ శీర్షిక మొదలైంది. ఈనాటికీ కొనసాగు తోంది. రచయితల, పాఠకుల స్పందన అద్భుతంగా లభిస్తోంది. దానితో నా రచనా వ్యాసంగం 'అ-పూర్వం'గా ఊపందుకుంది. అలా, రచనా పునరుద్ధరణకి పునఃప్రేరణ నిచ్చిన రాంబాబుగారికీ, విజయబాబు గారికీ మున్ముందుగా నా హార్దిక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను!
నా సాహితీ జీవనయాత్రలో 2007 ఒక స్వర్ణ వర్షం. ఒక్క సంవత్సరంలో 22 కథలూ, 100కి పైగా వ్యాసాలూ (తెలుగు కథ-తేజోరేఖలుతో కలుపుకుని) వెలువడినై. ఆ 22 కథల్లో నుంచీ ఈ సంపుటికి 15 కథలు ఎన్నుకోవడం జరిగింది.
సుప్రసిద్ధ కథాఋషి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, నాకు అత్యంత గౌరవాస్పదులు, నేను ఆరాధించే కథకుల్లో ఒకరు-అయిన మాన్యశ్రీ మునిపల్లెరాజుగారు నేను కోరగానే 'పరిచయం' పేరున ముందుమాట అందించారు. అలాగే 'కథానిక స్వరూప స్వభావాలు' పరిశోధన ద్వారా ఈనాటికీ కథానికకు సంబంధించి ఒక ''రిఫరెన్స్'' గురువులా గౌరవింపబడుతున్న డా|| పోరంకి దక్షిణామూర్తిగారికి వారి పరిశోధన కాలంనుంచి నా కథానికలమీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ సంపుటిలోని కథలమీద వారి అమూల్య అభిప్రాయం కూడా నాకు ఎంతో సౌజన్యంతో అందజేసారు. వీరిద్దరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.
కథా సంపుటి ముద్రణ బాధ్యతలో శ్రమతీసుకున్న రాంబాబు గారికి ప్రత్యేకంగా అభివందనాలు.
పుస్తకానికి ముఖచిత్రం కూర్చిన 'బాలి' గారికీ, డిటిపి డిజైన్ చేసిన మను గ్రాఫిక్స్ వారికీ, ముద్రణ చేసిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ వారికీ నా కృతజ్ఞతలు.
నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహిస్తూ, నాపట్ల ఎంతో ఆదర గౌరవాల్ని చూపుతున్న వివిధ పత్రికా సంపాదక వర్గ సభ్యులకీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
'కొత్తనీరు' కథని 'కథ 2007'కు ఎంపిక చేసిన సంపాదకులు పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్ గారల సౌజన్యానికీ అభినందనలు.
'కొత్తనీరు...మరికొన్ని కథలు' సంపుటికి మీ ఆదరాభిమానాల్ని ఆకాంక్షిస్తూ...,
అభినందనలతో,
-విహారి