తొణకిన స్వప్నం
చె ఒక విశ్వనరుడు. అరుదైన పోరాటయోధుడు, నాయకుడు. కోట్లాదిమందికి స్ఫూర్తిదాత. అర్జెంటీనాలో డాక్టర్‌గానో, క్యూబా ప్రభుత్వంలో మంత్రిగానో సంపన్న జీవనం గడిపే అవకాశాలను కాలదన్ని చివరి శ్వాసదాకా నమ్మిన ఆదర్శం కోసం రాజీలేని పోరాటం చేశాడు. దేశాలకీ, ఖండాలకీ అతీతంగా పీడిత ప్రజల కోసం ఎల్లలులేని విప్లవోద్యమం నడిపిస్తూ ఆ క్రమంలోనే వందమంది క్యూబన్ యోధులతో కాంగో వెళ్ళి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించాడు.
చె గురించి తెలుగులో కొన్ని పుస్తకాలొచ్చినా ఆఫ్రికన్ పోరాట వివరాలు రాలేదు. చె గురించి ఓ సమగ్ర అవగాహన కావాలంటే అతని డైరీలు తెలుగులో రావాలని నా కోరిక. ఇప్పడది సాధ్యమైంది.
చె గొప్ప సాహసికుడని మనకు తెలుసు. కానీ, అతనిలో కొండంత ఓర్పు, సంయమనం ఉండేవని ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. చె ఎంత నిరాడంబరంగా ఉండేవాడో, విమర్శ చేస్తే ఎంత నిర్మొహమాటంగా చేసేవాడో, ఆత్మవిమర్శ చేసు కుంటే ఎంత నిజాయితీతో చేసుకునేవాడో మనకి అర్థమవుతుంది. తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్ని సైతం ప్రశాంతంగా, నిర్భయంగా ఆశావాదంతో ఎదుర్కోవడం అతని జీవితం నుంచి నేర్చుకోవాలి.
ఇప్పడు క్రాంగోలో పరిస్థితులు అరాచక- అంతర్యుద్ధాలతో మరీ దిగజారి పోయాయి. త్యాగనిరతి, క్రమశిక్షణ కలిగిన నాయకత్వంతోనే కాంగో ప్రజలు సామ్రాజ్యవాద శక్తులను దీటుగా ఎదుర్కోగలరనేదే చె కాంగో అనుభవాలు నేర్పుతున్న పాఠం.
ఇదొక వైఫల్యానికి చెందిన చరిత్రే కావచ్చు. కానీ, విస్మరించని గతం భవిష్యత్తుకి మార్గదర్శకం. (Past experience, if not forgotten, is a guide to the future).
ఎంతో నిబద్ధతతో చె డైరీలను తెలుగులోకి అనువదించిన సత్యంకు ప్రత్యేక కృతజ్ఞతలు.
- రవిప్రకాష్