పరిచయం
శ్రీకృష్ణదేవరాయల 'భువనవిజయం'లో 'అష్ట దిగ్గజాలు' అని ఎనిమిది మంది గొప్పకవులు ఉండేవారు. అల్లసాని పెద్దన, రామరాజ భూషణుడు, ధూర్జటి- వంటివారు ఈ అష్టదిగ్గజాలలో ఉన్నారని మనకు ఖచ్చితంగా తెలుస్తోంది. అయితే, తెలుగువారు... ఇంకా చెప్పాలంటే, భారతీయులు కాలం విషయంలో ఆంగ్లేయులంత పట్టింపులు పెట్టుకోకపోవడం వల్ల, రాయలకాలంలో లేని తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన్న- వంటి కవులు కూడా అష్టదిగ్గజాలలో చేరిపోయారు. మనవాళ్ళే చేర్చారు. ఎందుకిలా జరిగిందంటే, మానవ మనస్తత్వాలలో వైచిత్రే దీనికి ప్రధాన కారణం అని చెప్పకతప్పదు. పాశ్చాత్యుల దృష్టిలో ఇది ఘోరమైన నేరం కావచ్చు! కానీ, తారీఖులకీ, దస్తావేజులకి ప్రాధాన్యం ఇవ్వని భారతీయులకు ఇది తప్పుకాదు!
తెనాలి రామకృష్ణుడు అంటే అందరి దృష్టిలో కేవలం ఒక వికటకవి మాత్రమే! అయితే, అతను రాసిన కావ్యాలు చదివిన వారికి అతనెంత మహాకవో బోధపడుతుంది. ముఖ్యంగా పదాలను ప్రయోగించడంలో రామకృష్ణుడు అందెవేసిన చేయి. అందువల్లనే, ఆంధ్రసాహిత్యంలో ''పాండురంగవిభుని పదగుంఫన'' అనే మాట ప్రసిద్ధికెక్కింది. ఉపనిషత్తుల విజ్ఞానం, సామాన్యప్రజల జీవిత పరిశీలన, సునిశితమైన హాస్యం రంగరిస్తే రామకృష్ణుని కవిత్వం అవుతుంది. తెలుగువారికి రామకృష్ణుడంటే ప్రాణం! అందుకే, అతనిని ఆలంబనగా చేసుకొని ఎన్నెన్నో హాస్యకథలను సృష్టించుకున్నారు. ఈ హాస్యం ఒక్కొక్కప్పుడు కాస్త హద్దుమీరటం కూడా జరిగింది. దీనివల్ల రామకృష్ణునికి వాటిల్లిన నష్టమేమీ లేదు. ఎంతోమంది మహాకవులు తెనాలి రామకృష్ణుని కవిత్వానికి ఆదర్శంగా పెట్టుకున్నారు. ఆధునిక కవి శ్రీశ్రీ కూడా రామకృష్ణుని అభిమానే!
పాండురంగ మహాత్మ్యం కేవలం భక్తిరస ప్రధానమైన కావ్యం మాత్రమే కాదు! మనిషనేవాడు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతక్కూడదో నిర్ధేేశించే అపురూపకావ్యం కూడా. బాలలకి అనుగుణంగా ఉండేవిధంగా, ఈ కావ్యంలో చిన్నచిన్న మార్పులను చేయడం జరిగింది. తెలుగులోని పంచకావ్యాలలో ప్రధానమైన ఈ కావ్యం పిల్లలకి నచ్చుతుందని అపరిమితమైన నమ్మకంతో...
-రచయిత