ఈ దండోరా గ్రంథంలో నా 21 రచనలున్నాయి. వీటిలో రెండు కవితలు, మూడు కథానికలు, మూడు ముఖ్యుల గ్రంథాలకు రాసిన ముందుమాటలు.
ఇందులోని పదమూడు రచనలు డా.చిలుమూరి శ్రీనివాసరావు, ఆచార్య కొలకలూరి మధుజ్యోతి సంకలనం చేసిన 'దండోరా అంబేద్కరు అభీష్టం' గ్రంథంలో ముద్రితాలయ్యాయి. ఆ గ్రంథం విశేష ప్రచారం, ప్రాచుర్యం పొందింది.
ఇంకో ఎనిమిది రచనలు, ఆ పదమూడింటికి చేర్చి ఇప్పుడు ఈ దండోరా గ్రంథం ముద్రణ చేయిస్తున్నాను.
'దండోరా అంబేద్కరు అభీష్టం' అనేది ఆ గ్రంథం పేరే కాక నేను రాసిన ఒక వ్యాసం పేరుకూడా. అది ఆంధ్రజ్యోతి దినపత్రికలో మొదట ముద్రితమయింది. దీన్ని దండోరా ఉద్యమం తమ మార్గదర్శకంగా ఎంచుకొంది. ఈ మాట అప్పటి దండోరా జనరల్ సెక్రటరీ శ్రీ కృపాకర్ మాదిగ ఆనందంగా ప్రకటించాడు. కీ.శే. కె.జి.సత్యమూర్తి ఈ వ్యాసాన్ని తన 'ఏకలవ్య' పత్రికలో పునర్ముద్రించాడు. చిన్న పెద్ద పత్రికలు దీన్ని మళ్ళీ మళ్ళీ ముద్రించాయి. ప్రజలు వాటిని కరపత్రాలుగా ముద్రించి వివిధ ప్రాంతాలలో పంచిపెట్టారు. దీన్ని నాడు ఇష్టపడ్డ వాళ్ళు నేటికీ ప్రస్తావిస్తున్నారు.
ఇందులో ప్రతిపాదించిన అంశాలను తిరస్కరించినవాళ్ళు కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి ఒక ఆంధ్రసోదరుడు విస్తృతమైన వివరణ రాసి, ఏ పత్రికలోనూ ప్రచురించకుండా, కరపత్రంగా ముద్రించి, రాష్ట్రమంతటా చేరేట్టు చేశాడు. దాన్ని ఢిల్లీ నుంచి ఆత్మీయులు నాకూ పంపారు. చదివి చాలా ఆనందించాను. కారణం, నా ఈ రచనకు అనుకూలంగా అందరు, ప్రతికూలంగా ఒక్కరు ప్రతిస్పందించి నందుకే కాదు, అంతకు ముందటి నా వ్యాసం కూడా తెప్పించుకొని దీనితో తారతమ్యం బేరీజు వేస్తూ చదివినందుకు.
నేటికీ దండోరా ఉద్యమ సందర్భంలో ఈ వ్యాసం చాలామంది ఉదాహరిస్తూ ఉండటం ముదావహం. దండోరా ఉద్యమ సిద్ధాంతం బలంగా స్థాపించిన వ్యాసంగా గుర్తించటం ఆనందదాయకం.
దండోరా ఉద్యమం ఊపు అందుకొంటున్న తరుణంలో దాన్ని ప్రోత్సహించటం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి దినపత్రికల్లో వ్యాసాలు రాసి ప్రచురించటమేకాక, వరుసగా వారంరోజులపాటు ఆంధ్ర ప్రభ దినపత్రికలో దండోరా వ్యాసాలు రాశాను. అవన్నీ ఆ సంకలన గ్రంథంలో చోటుచేసుకున్నాయి.
ఈ గ్రంథంలో ఆ వ్యాసాలతోపాటు రెండు కవితలు, రెండు వ్యాసాలు, మూడు కతానికలు చేర్చాను. నేనీ విషయం మీద 1954 నుంచి రచనలు చేస్తున్నాను. నాది సాహిత్యోద్యమం. సాంఘికోద్యమంలో భాగస్వామిని.
నేను 1960 నుంచి సాహిత్య గ్రంథాలకు ముందు మాటలు రాశాను. 'కుసుమాంజలి'కి 1969లో వెలిబుచ్చిన అభిప్రాయం సంపాదకులు సంపాదించి సంపాదకులు తమ సంకలనంలో చేర్చటం విశేషానంద కారకమయింది.
1979లో ఆంధ్రపత్రిక ఆదివారం అనుబంధంలో 'పేరుల్లోనూ కులం' వ్యాసం ముద్రితమయింది. అందులో అందరూ తమ పేర్లతో పాటు కులం పేరు చేర్చుకుంటున్నట్లు మాలమాదిగలు కూడా తమ పేరు పక్కన తమ కులం పేరు చేర్చుకోవటం ఎందుకు అవసరమో తెలిపాను.
1980లో మాధవరావు మాదిగ పేరు చూచి నేను పొంగిపోయాను. ఇప్పుడు రాష్ట్రమంతటా చాలామంది మాదిగ కులస్థులు తమ పేరు కులం పేరుతో కలిసి రాసుకోవటం ఆనంద దాయకమే.
ఈ సంకలనంలోని చివరి వ్యాసం మేల్కొంటే విజయం ఖాయం. దండోరా రాజకీయ చైతన్య దృష్టిని ప్రతిపాదించింది. ప్రజలు గ్రహిస్తారని ఆశిస్తున్నాను.
ఈ దండోరా గ్రంథంలోని విభిన్న రచనలు ఏకాంశ విశ్లేషకాలు. ఇది మాదిగ జాతి చైతన్యానికి, ఆలోచనకు, ఆచరణకు ఏమాత్రం ఉపయోగపడినా నేను అమితంగా ఆనందిస్తాను.
భారతజాతి సమైక్యంగా, సమగ్రంగా ఉండటానికి, మాలమాదిగలు దాయాదుల్లా కాక అన్నదమ్ముల్లా ఐకమత్యంతో, సమన్వయంతో సంధితో జీవించాలి. అలా జీవించటానికి మాదిగలు, సమర్థులైన మాలలతో సమంగా సమర్థులు కావటానికి, జీవించటానికి చేయవలసిన ప్రయత్నం అది ఆపలేని, ఆపరాని అవసరం. సమర్థులైన సోదరులు సమగ్ర భారతీయ సమైక్యానికి దోహదం చేస్తారు.
విజయోస్తు.
శుభాకాంక్షలతో
మీ
(కొలకలూరి ఇనాక్)