మిత్రవాక్యం
1976 ప్రాంతంలో ఆంధ్రపత్రిక కథానికల పోటీలో నా 'సముద్రం' కథానికకు బహుమతి వచ్చింది. అదే సమయంలో ఆంధ్రపత్రికలో 'శమంత-హేమంత' అనే సీరియల్ ప్రచురణా జరిగింది. ఆ రచయితా హైదరాబాద్‌లోనే ఉన్నారని తెలియడంతో కలుసుకోవడం జరిగింది. ఖచ్చితంగా చెప్పాలంటే నాకంటే ఆయన సీనియర్ రచయిత. క్రమంగా మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మంచి కథానికలే కాదు, సున్నిత స్వభావం గల ఆయన నన్ను ఆకర్షించాడు. ఇద్దరం తరచూ కలుస్తుండేవాళ్ళం, హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంగణంలో. అంతేకాదు, ఆయనతోపాటు-మరో ఇద్దరు రచయితలతో కలిసి రెండు గొలుసు కథానికల్ని రాయడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకను కుంటున్నారా? ఆ మిత్రుడు మరెవరో కాదండీ-పి.వి.ఆర్. శివకుమార్!
ఎన్నో కథానికల్ని రాశాడు, కానీ ఒక్క సంపుటీ తీసుకురాలేదు. వారపత్రికల్లో పడితే ఆ రచన జీవితం కొన్ని వారాలు. మాసపత్రికల్లో పడితే కొన్ని మాసాలు! అందుకనే రచయిత మిత్రులందరితోనూ చెప్తుంటాను, మీ కథానికల్ని సంపుటాలుగా తీసుకు రావడం అవసరమని. అలా ఈ కథానికా శతజయంతి సంవత్సరంలో మిత్రుడు పి.వి.ఆర్. శివకుమార్‌కీ సలహా ఇవ్వడం జరిగింది. ఆయన నా మాటకు విలువిచ్చి ఇలా సంపుటిగా తీసుకురావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ ఆనంద వ్యక్తీకరణే ఈ మిత్రవాక్యం.
మనుషుల్లో విలువల్ని పెంచేవి, మనుషుల మధ్య బంధాల్ని పెంచేవి మంచి కథానికలు.... అలాంటి ఎన్నో కథానికల్ని రాసిన శివకుమార్‌కి ఈ సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ మరో కథానికా సంపుటిని త్వరలోనే తీసుకురావాలని కోరుతూ శలవు తీసుకుంటున్నాను.
-డా|| వేదగిరి రాంబాబు
హైదరాబాద్ 1-8-59/1/7
26-1-2010 చిక్కడపల్లి, హైదరాబాద్