వందన చందనం
శ్రీకరము, శుభకరము అయిన నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించి అక్షరమాలలల్లింప జేసిన నా తల్లిదండ్రులకు, గురువర్యులు ఆచార్య కె.కె.రంగనాథాచార్యులకు నా తొలి వందనాలు. బాధ్యత-బాంధవ్యాలు, వృత్తి-ప్రవృత్తిల మధ్య దూరపు కొసల్ని కలిపి ముడివేసే ప్రయత్నమే ఈ కవితా రచన.
నా ఆనందానికి, ఆరోగ్యానికి, సంస్కారానికి ఆలంబనమైన ఈ కవిత్వమే నా ఊపిరి. నాకు తోచిన, నాకు నచ్చిన భావాల ప్రతిరూపానికి ప్రసిద్ధ కవి డా. అద్దేపల్లి రామమోహనరావు, రెక్కల రూపశిల్పి సుగంబాబు, కలిమిశ్రీ, శ్రీనివాసగౌడ్ తదితరుల ప్రోత్సాహము, అభినందనల ఫలితమే నా ఈ ప్రయత్నఫలం.
'రెక్కలు-హైకూలు' ప్రక్రియల్లో అప్పుడప్పుడు రాసినవాటిని గ్రంథ రూపంలోకి తీసుకురమ్మని నన్ను ప్రోత్సహించిన నా కుటుంబసభ్యులకు, మిత్రులకు, సాహితీసంస్థల నిర్వాహాకులకు, అడగగానే ఆప్యాయతతో తమ అమూల్య అభిప్రాయాలను రాసి ఇచ్చిన ఆచార్య కొలకలూరి ఇనాక్, సుధామ, తోటపల్లి సాయినాథ్‌లకు ప్రత్యేక వందనాలు.
ఈ 'అర్ధార్ధ చంద్రికలు' పుస్తక ముద్రణకు ఆర్థిక సహకారం అందించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి, మానస ఆర్ట్ థియేటర్స్ కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు.
చక్కగా డి.టి.పి. చేసి ఇచ్చిన కొమ్మూరి ప్రసాద్‌కు కృతజ్ఞతలు. సకాలంలో అందంగా అచ్చువేసి అందించిన వేణు గ్రాఫిక్స్ వారికి కృతజ్ఞతలు. నా హైకూలు, రెక్కలు కవితలు ప్రచురించిన పత్రికా సంపాదకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా శ్రేయోభిలాషులు డా. పులిగడ్డ విజయలక్ష్మి, బండారుపల్లి రామచంద్రరావు, డా. లలితవాణి, డా|| నోరి రాజేశ్వరరావు, బొల్లిముంత వెంకటరమణారావు, జె.వి.రావు, ఎన్.రఘువీరప్రతాప్, పుట్టా, మధు తదితరులకు కృతజ్ఞతలు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞత సుమాంజలులు.
- రఘుశ్రీ