చేర్పు
నా సాహిత్య వ్యాస సంపుటాల కూర్పుకు ఈ 'ప్రస్తావన' ఈనాటి చేర్పు! కథా సంపుటాలు, నవలలు, నాటకాలు, కవితా సంపుటాలు, పద్య కావ్యాలు-ఇవన్నీ ఒక యెత్తు కాగా, వ్యాస సంపుటాలు ఒక యెత్తు. సమీక్షకునిగా, విశ్లేషకునిగా, విమర్శకునిగా నాకు పాఠకుల, కవి పండిత విమర్శకుల అభినందనల్ని ఇబ్బడిముబ్బడిగా అందించినవి-నా సాహిత్య వ్యాస సంపుటాలు. సుమారు 300 కథల మీదనే నేను పరిచయ వ్యాసాలు వ్రాశాను, విశ్లేషణలు చేశాను. వీటిలో 200-రెండు సంపుటాలుగా (కథాకృతి-1, కథాకృతి-2) శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురణలుగా వెలువడి తెలుగు సాహితీ లోకం ప్రశంసల్ని బహుథా నాకు అందించినవి. ఇది ఒక ఆనంద తరంగమైతే, 'కృతి' సాహిత్య వ్యాస సంపుటానికి విశాఖపట్టణం కొండేపూడి సుబ్బారావు స్మారక సాహిత్య పురస్కారం లభించటం, అందునా వారి పేరుననే గల పద్య కావ్య పురస్కారం కూడా నా 'శ్రీ పదచిత్ర రామాయణము' (అరణ్య కాండము)నకు- అదే సంవత్సరం-ఏకకాలంలో-లభించటం ఒక 'అ'పూర్వమైన ఘనసత్కారోత్సవ సమ్మోదం! ఆ'కృతి'లోని వ్యాసాలు కొన్ని జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లోని ప్రసంగ పత్రాలుగా కవిపండిత, సాహితీవేత్తల అభినందనల్ని పొందటం మరొక ప్రహర్ష సన్నివేశం!
ఈ 'ప్రస్తావన' సంపుటంలోని (పెద్దింటి అశోక్‌కుమార్, తల్లావఝ్జుల పతంజలిశాస్త్రి గార్ల నవలలపై విశ్లేషణాత్మక) వ్యాసాల్లో కొన్నిటిని పరిశీలనగా చదివి ఆనాటి ఆర్.ఎస్.సుదర్శనం వంటి పెద్దల గవేషణావైశిష్ట్యం వీటిలో కలదని కొందరు సాహితీకారులు మెచ్చుకున్నారు. వారికీ, వీరికీ, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
'ప్రస్తావన'కు సాహితీలోకం ఆదరాభిమానాల్ని ఆశిస్తూ, శుభాకాంక్షలతో...
-విహారి