సందర్భం
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఇతర అవార్డులూ, రివార్డులూ- అదొక పెద్ద పట్టిక. కథగానీ, నవలగానీ రాసే రచన మరేదైనాగానీ, ప్రతి ఒక్కదాన్నీ 'మూస'కి భిన్నంగా తనదైన 'ముద్ర'తో, 'ప్రఙ్ఞ'తో ఆవిష్కరిస్తున్న ప్రతిభామూర్తి సలీం. ఆయన రచనలంటే అందుకూ నాకు ప్రత్యేకంగా మక్కువ. సౌమ్యుడూ, సౌజన్యశీలీ, నిత్య సాహిత్య విద్యార్థీ సలీం. అందుకే ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా నాకు గౌరవం. ఆ మక్కువా, ఈ గౌరవమూ కలిపి నన్ను ఈ గ్రంథ రచనకు పురిగొల్పాయి.
ఇది 'దీపిక'. సలీం రాసిన ఏడు నవలలమీద విశ్లేషణాత్మక పరామర్శ. 'దీపిక' ఎప్పుడూ వెలుగుల్నే ప్రసరిస్తుంది. నా సమీక్షల్ని గురించీ, విశ్లేషణల్ని గురించీ 'అంతా మంచి చెబుతాడనే' వ్యాఖ్య ఉన్నది. ఇది నాకొక 'సర్టిఫికెట్'గా భావిస్తాను. లోకానికి మంచి చెప్పాలి. మనిషి విడిగా లోపం చూపాలి! గ్రంథ పరామర్శ అనేది చదువరిచేత ఆ పుస్తకాన్ని కొనిపించి, చదివించి, ఆ రచనలోని మంచిని ఆనందించడానికీ, ఆచరించడానికీ సహాయకారి కావాలి. ఇది నా నిబద్ధత!
కవిగా, కథకుడుగా ఉన్న విహారి-అసలు సమీక్షకుడైనది ఇందుకే! విమర్శకాగ్రేసరులు పట్టించుకోని సమకాలీన రచనల్లోని 'మంచి'ని చూపటానికే! నాకు చెడుని చెప్పే లేక రంధ్రాన్వేషణ చేసే విమర్శకుడన్న పేరు వద్దనే వద్దు! నేను Positive Reinforcement అనే సిద్ధాంతానికి చెందినవాడిని.
సలీం నవలల్ని పరామర్శించేటప్పుడు దాదాపు ప్రతి నవలలోని ఇతివృత్తం మొత్తం పాఠకుడు దర్శించగలిగే విధంగా అనేకచోట్ల వివరంగా చెప్పాను. దీనికి కారణం అసలు కథ తెలియజేయకుండా విమర్శను సంధించే విధానం నా పరామర్శ అంగీకరించకపోవడమే. అలాగే నవలా భాగాల 'ఉటంకింపులు' కొన్నిచోట్ల దీర్ఘంగా ఉన్నాయి. ఆ అంశంలో రచయిత ప్రతిభా, రచనలోని 'ఆత్మ' చదువరికి అవగతం కావడానికి వాటిని ఆ విధంగా పొందుపరచవలసి వచ్చింది. పాత్ర చిత్రణ అధ్యాయంలో ముఖ్యమైన కొన్ని పాత్రల ఆవిష్కారాన్ని మాత్రమే విశ్లేషించాను. మొత్తం 7 నవలల్లో అనేక పాత్రలు ఉండటంవలన ప్రధాన పాత్రల రచనా విశేషాల్ని మాత్రమే పరామర్శించటం జరిగింది.
మరీ ఈనాటి వర్తమానంలోని Topical Issues ని, సామాజిక ఆవశ్యకతని ఆవిష్కరిస్తూ ఎంతో బాధ్యతతో, చిత్తశుద్ధితో సలీం రాసిన ఈ గొప్ప నవలల్ని చదివిన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని ఈ నవలా పరామర్శని నేను ముచ్చటపడి మనస్ఫూర్తిగా చేశాను. సలీంపట్ల, సలీం నవలలపట్ల నాకున్న ఆరాధనా భావంలోని చిన్న కునుక-ఈ గ్రంథం. 'దీపిక' చాలా నెలల క్రితమే రావలసిన పుస్తకం. Multi task Orientation ఉన్న వ్యక్తినీ, రచయితనీ కూడా కావటంవలన ఈ ఆలస్యం జరిగింది. ఈ సందర్భంగా సలీంకి దోసెడు అభినందనలు!
పుస్తకాన్ని శ్రమతీసుకుని ఎంతో చక్కగా డి.టి.పి. చేసి ఇచ్చిన (మను గ్రాఫిక్స్) శ్రీమతి వరలక్ష్మి, శ్రీ కుడుపూడి భాస్కరరావు దంపతులకు కృతజ్ఞతలు.
శుభాకాంక్షలతో...
విహారి