రచయిత మాట
ఈ పుస్తకం 15 ఏళ్ళ క్రితం రాశాను. అప్పటికి ఇప్పటికి స్త్రీ పురుష సంబంధాల్లో అనేక మార్పులు వచ్చాయి. సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్, ఛాటింగ్, ఫేస్‌బుక్ వంటి ఆధునిక సాంకేతిక ప్రక్రియల ద్వారా స్త్రీ, పురుషుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే మౌలిక సమస్యలు, ఘర్షణ వాతావరణ మాత్రం అలాగే వుంది. దీనికి కారణం? సమాజంగురించి మానవ పరిణామం గురించి, మానవసంబంధాల గురించి, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిని మానవీయకోణంలో నుంచి ఆవిష్కరించే ప్రయత్నం గురించి సరిఅయిన అవగాహన లేకపోవడమే! ఈ పుస్తకం, స్త్రీ గురించి, ప్రాథమిక అవగాహన కలగడానికి రాశాను. స్త్రీపట్ల నా కున్న సామాజిక కోణంలోకూడా కొన్ని లోపాలుండొచ్చు. పాఠకులు వాటిని తెలియజేస్తే, మలిముద్రణలో మార్చుకొంటాను. ఈ పుస్తకంలో ఓ వర్గాన్నికాని, కులాన్నికాని,మతాన్నికాని కించపరిచే ప్రయత్నం చేయలేదు. చరిత్ర పరిణామదశను వివరించే ప్రయత్నం చేశాను. పలురంగాల్లో పేరుగాంచిన స్త్రీల వివరాల గురించి, పుస్తకం చివర్లో చేర్చిన శ్రీమతి జి.రమాదేవి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
- యస్.డి.వి.అజీజ్