Book

మాకూ ఒక భాష కావాలి...!

తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌,

Book
నామాట   
  'దళిత వ్యాకరణం' రాసి ఇప్పటికి ఐదు సంవత్సరాలు దాటింది. మళ్లీ 'మాకూ ఒక భాష కావాలి' సంకలనంతో మీ ముందుకొస్తున్నాను. ఈ ఐదు సంవత్సరాల్లో దేశ కాలమాన పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. అస్పృశ్యత, వివక్షత, దళితుల మీద దాడులు కొనసాగుతూనే వున్నాయి. కొన్నిచోట్ల వివక్ష వ్యవస్థీకరించబడింది కూడానూ. సంఘర్షణ కొనసాగుతూనే వుంది.
  వివక్ష వికృతరూపం అన్నిచోట్లా కనబడుతూనే వుంది. ఒకప్పుడు 'వివక్ష' అనే పదాన్ని కూడా ఒప్పుకునేవారుకాదు. వివక్ష ఎక్కడుందని ప్రశ్నించేవారు. ఇప్పుడు లింగవివక్ష, స్త్రీలపట్ల వివక్ష, నిమ్నకులాలపై వివక్ష, మతపరమైన వివక్ష వెర్రితలలు వేస్తోంది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో వివక్షపూరితమైన వ్యాఖ్యలు కల్లోలం సృష్టిస్తున్నాయి.
  ఇప్పుడు వివక్ష ఉందని కనీసం అంగీకరిస్తున్నారు. ఈ వివక్ష 'అస్తిత్వాన్ని' సైతం కబళిస్తోంది. ఖైర్లంజీ, గోద్రా, కంధమాల్‌ సంఘటనలపట్ల జాతీయ మీడియా నుంచి మహిళాసంఘాల వరకూ పెద్దగా గొంతువిప్పిన దాఖలాలు లేవు. ఫ్యాషన్‌మోడల్‌ జెస్సీకాలాల్‌ మీద మానవ మృగం దాడిచేసినప్పుడు దేశమంతా కట్టకట్టుకుని తమకూతురే మరణించినట్లు విలపించి ఇండియాగేట్‌ దగ్గర కొవ్వొత్తులు వెలిగించింది. 'నిర్భయ' మానభంగం, హత్య విషయంలో అదే జరిగింది. ఈ కవి ఖైర్లంజీ దుర్ఘటన గురించి మొదటిసారిగా 'సూదిబెజ్జంలో ఒంటెలు' అని కవిత రాసేవరకూ ఖైర్లంజీలో భయ్యాలాల్‌ కుటుంబాన్ని అగ్రకులాలు మట్టుబెట్టాయన్న సంగతి ఆంధ్రరాష్ట్రానికి తెలియరాలేదు.
  'మాకూ ఒక భాషకావాలి' పుస్తకంలో ఉన్న కవితలన్నీ దళితదృక్పథంతో, అంబేద్కర్‌ భావజాలాన్ని కలగలిపి రాసినవే. అంబేద్కర్‌ భావజాలం మహారాష్ట్రను సుసంపన్నం చేసింది. దళితులను ఉత్తేజపరిచింది.
  ఈ భావజాలం ఆంధ్రరాష్ట్రంలో పీడనకు గురౌతున్న దళితజాతిని మేల్కొలపడానికి సహాయపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
  నా కవిత్వం ఎంతవరకు ప్రజల్ని ప్రభావితం చేసిందని నేనిక్కడ ఒక ప్రశ్న వేసుకుతీరాలి. 'దళితవ్యాకరణం' అనే కవితలో 'వర్ణచక్రాలు దాగని రాఘవులూ... ఒట్టొట్టి సైకిళ్ళు దిగవోయి ముందూ...' అని రాసింతర్వాత సీపీఐ పార్టీలో కొంత చర్చ జరిగిన మాట వాస్తవం. తర్వాత ఆ పార్టీ 'కులవివక్ష పోరాట సమితి' అక్కడక్కడా కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం జరగడం మనం పేపర్లలో చదివాం.
  'మాకూ ఒక భాషకావాలి' సంకలనంలో మెజారిటీ పీడితుల పక్షాన నిలబడిన కవితలే. తెలంగాణను వ్యతిరేకించినవారినీ, సెట్లర్లకు మద్దత్తు పలికిన వారినీ ఆంధ్ర పెట్టుబడిదారులకు తొత్తులని ముద్రవేయడం, అందువల్ల నిజంగా ఇబ్బందులుపడే సెట్లర్ల గురించి రాయాలని ఉన్నా, భయంతో రాయకపోవడం మామూలైపోయింది. ఎవరిగొంతు వినపడదో వారిపక్షాన నిలబడి రాయాలనుకుంది ఈ కలం. ఏముద్రవేసినా సరే! కోస్తా జిల్లాల్లో మెజారిటీ వ్యవసాయక కూలీలు దళితులే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి సమస్య ఏర్పడితే, పెట్టుబడిదారుల మాట దేవుడెరుగు. ముందుగా కడుపుమాడిపోయేది వీళ్ళకే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటువల్ల నీటి సమస్య పరిష్కారం అవుతుందనడం ఎంతవరకు నిజం! ఎప్పుడో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టులు ఈనాటికీ సరిగ్గా నీటికొరతను తీర్చిన పాపానపోలేదు. అందుకే సెట్లర్ల పక్షాన నా గొంతు మోగింది.
  'బడుగు రాతలు' రాసిన ఆంధ్రజ్యోతిపై మందకృష్ణవర్గం రాళ్లేసిన సంఘటనలో సమస్త జర్నలిస్టులోకం, కవులూ, కళాకారులూ ఎడిటర్‌ శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా సమర్థించాయి. వ్యక్తిగతంగా శ్రీనివాస్‌ నాకు మంచి మిత్రుడు, స్నేహితుడు. నా మెజారిటీ కవితలు 'వివిధ'లో ప్రచురించబడడానికి శ్రీనివాస్‌ కారకుడు. ఒకరకంగా నన్ను ప్రోత్సహించి కవిని చేసింది శ్రీనివాస్‌. కానీ మందకృష్ణ జ్యోతిమీద రాళ్లేసిన ఘటనలో శ్రీనివాస్‌ అరెస్ట్‌ అయినప్పుడు, మందకృష్ణకు అనుకూలంగా నేను 'సిగ్గుమాలిన సిరాచుక్కలు' అని 'సూర్య'లో ఒక కవిత రాశాను. వ్యక్తులెవరైనా అస్తిత్వవాదం ముఖ్య అనుకున్నాను గనుక దళితవాదానికి గట్టి మద్దత్తుదారుణ్ణని నమ్ముతున్నాను గనుక 'బడుగు రాతల'ని చేసిన ఎద్దేవామీద పోరాటం చేశాడు గనుక మందకృష్ణను సమర్థించాను. అలాగని దళితులను ముక్కచెక్కలు చేసే ఉద్యమాల్ని మందకృష్ణ లేవదీస్తే అందుకు నేను మద్దత్తు పలకలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత శ్రీనివాస్‌ గారిని పలకరించడానికి నాకు ధైర్యం చాలలేదు గానీ ఆయనే 'నాకు వ్యతిరేకంగా రాసినా, నీ నిజాయితీ నాకు నచ్చింది సుధాకర్‌' అనడం ఆయన గొప్పతనాన్ని తెలియజేసింది.
  దళిత క్రైస్తవులు సామాజికంగా సాంస్కృతికంగా ఎదుర్కొంటున్న సమస్యలు నా సమస్యను నిరంతరం కలిచివేస్తున్నాయి. నాదీ దళితక్రైస్తవ నేపథ్యమే. అందుకే ఐదారు కవితలు దళితక్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలమీదే రాశాను. దళిత క్రైస్తవులకూ ఎస్సీల హోదా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మతస్వేచ్ఛ భారత రాజ్యాంగం ప్రసాదించింది గనక, ఈ దేశం లౌకిక రాజ్యం గనక, కేవలం క్రైస్తవం స్వీకరించినంత మాత్రాన, క్రైస్తవులకు రిజర్వేషన్లను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం. దీనిపై నా పోరాటం సాగుతుంది.
  దళితవ్యాకరణ సంకలనంలో తెలంగాణ పోరాట పోకడలపై నేనే మొదటి వ్యతిరేక కవితను రాశాను. అంబేద్కర్‌ చిన్నరాష్ట్రాలను సమర్థించాడు కదాని కొంతమంది వాదిస్తారు. అంబేద్కర్‌ చిన్న రాష్ట్రాలను సమర్థించిన మాట నిజం. కానీ ఆనాటి దేశకాలమాన పరిస్థితులు వేరు. స్వాతంత్య్రం వచ్చిన కాలంలో కొంతలో కొంతైనా దేశీయభావన ప్రజల్లో ఉండేది. ఇప్పుడు బొంబాయిలో, ఆమాటకొస్తే దేశవ్యాప్తంగా మతతత్వశక్తులు పుట్టుకొచ్చి అధికారం చేపట్టిన పరిస్థితులు, బీహారీలనూ, దక్షిణాది వాళ్లనూ బొంబాయి నుంచి వెళ్ళగొట్టిన సంఘటనలు కొల్లలు. అందుకే చిన్న రాష్ట్రాలపై పెద్దచర్చ.
  నాకంటే కొన్ని మాసాలు చిన్నవాడైన బ్రిటిష్‌ కవి బెంజమిన్‌ జపానియా కవిత్వ ప్రక్రియతో నా కవిత్వాన్ని పోల్చి, నేనూ డబ్‌ కవినే అంటాడు సుప్రసిద్ధ కవి రామతీర్ధ. నా అభివ్యక్తిలో కొత్తదనముందని కవి కత్తి పద్మారావు అభిప్రాయపడితే, వచనగేయ లక్షణాలు కలిగి, లయానుగుణమైన అంతర్లీనంగా వున్న సంగీతం, వర్తమాన అంశాలపై వ్యాఖ్యానం, సామాజిక న్యాయం, రాజకీయాంశాలను స్పృశించి కవిత్వంలో నిరసన ప్రకటించడం మొదలైనవి నా కవిత్వాన్ని సుసంపన్నం చేశాయని డాక్టర్‌ లంకా ప్రసాద్‌గారు వ్యాఖ్యానిస్తుంటారు. పైన చెప్పిన లక్షణాలన్నీ డబ్‌ కవిత్వానివే గనక, నేను డబ్‌ కవినే అంటారు కవి రామతీర్ధ.
  ఈ సంకలనాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ...

-తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌
Read Book

మాకూ ఒక భాష కావాలి...!

Publication Date: May 01, 2013

Publisher: విజయభారతి పబ్లికేషన్స్‌

Edition: 2013

Language: Telugu

Pages: 133

 
 
 
This is Terms and conditions page description
This is product content page description
This is privacy policy page description
The Publisher of this website makes every effort to be as accurate and complete as possible in the creation and curation of the content published on this site. However, Publisher does not warrant or represent at any time that the contents within are accurate due to the rapidly changing nature of the Internet. The Publisher will not be responsible for any losses or damages of any kind incurred by the reader whether directly or indirectly arising from the use of the information found on this website. The authors and Publisher reserve the right to make changes without notice. The Publisher assumes no responsibility or liability whatsoever on the behalf of the reader of this website. No part of the content available in the website may be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording or by any information storage and retrieval system, without written permission. This website is not intended for use as a source of legal, health, business, accounting or financial advice. All readers are advised to seek services of competent professionals in the legal, health, business, accounting, and finance fields. There are no representations or warranties, express or implied, about the completeness, accuracy, reliability, suitability or availability with respect to the information, products, services, or related graphics contained in this website for any purpose.