Book

పనామా బీచ్‌లో..

తరానా,

Book
ఆదర్శాన్ని అందలమెక్కించిన కథలు   
  'పనామా బీచిలో...' అనే ఈ కథా సంకలనంలో 12 కథలున్నాయి. రచయిత కలం పేరు తరానా. అసలు పేరు తానిపర్తి నారాయణరావు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైకాలజీ ఆచార్యులుగా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఇది వీరి రెండో కథాసంపుటి. తొలి సంపుటి 'తరానా కథలు' పేరిట 2010లో ప్రచురించబడింది.
  ఈ కథలు వస్తువు దృష్ట్యా, రచనా విధానం దృష్ట్యా ఈ కాలానికి అరుదైనవని చెప్పాల్సి ఉంటుంది. ఇందులోని భావుకత, ఆదర్శవాదం, పరిపూర్ణ వ్యక్తిత్వాలు ఈ రోజుల్లో సమాజంలోనూ లేవు, సాహిత్యంలోనూ కనిపించవు. రచయితలోని ఒక సానుకూల దృక్పథం, ఆదర్శాలపై విశ్వాసం, కాల్పనిక రచనా విధానం ఇటువంటి కథల సృజనకు దోహదం చేసాయనిపిస్తుంది. ఇందులోని కథల్లో సామాజిక సమస్యలైన కులాంతర వివాహాలు, స్త్రీలపై ఇంటా, బయటా జరిగే హింస, పెద్దలు, పిల్లల మధ్య పెరుగుతున్న అంతరాలు మొదలైనవి సమకాలీనమైన వస్తువులున్నాయి. అయితే వాటి చిత్రణలో రచయిత వాస్తవిక దృష్టికంటే కాల్పనిక దృక్పథమే ఎక్కువగా ప్రదర్శించారు. తన తొలి కథా సంపుటికి రాసిన ముందు మాటలో 'రచయిత తన సహజత్వాన్ని కోల్పోకూడదు. ఒక ఆదర్శం చూపించాలనో, లేదా ఒక సందేశం వినిపించాలనో వాస్తవాలను వక్రీకరించ కూడదని నా విశ్వాసం' అన్నారు నారాయణరావుగారు. ఆయన వాస్తవాలను వక్రీకరించని మాట నిజమే కానీ, ఈ సంకలనంలో మాత్రం ఆదర్శాన్ని ఎక్కువగానే ఆదరించారని చెప్పక తప్పదు (తొలి సంకలనంలోని కథల్లో వాస్తవిక చిత్రణ ఎక్కువగా ఉంది).
  రచయిత ఆశావహదృక్పథం, మనుషుల మంచితనంమీద ఆయనకున్న నమ్మకం ఈ కథలన్నిటిలోనూ స్పష్టంగా కనిపించే అంశాలు.దీనావస్థలో ఉన్న యువతీయువకులను ఎటువంటి స్వార్థమూ లేకుండా సమాదరించి, అక్కున చేర్చుకునే పెద్దలు (పున్నమిరేయి, గిరిపుత్రిక), ఏళ్ళ తరబడి దూరంగా ఉన్నా, ప్రేమను విస్మరించని స్త్రీపురుషులు (పిచ్చుకగూళ్లు), కుటుంబ మర్యాదకోసం అవలీలగా వ్యక్తిగత ఆనందాలను త్యాగంచేసే స్త్రీలు (జన్మ కుండలి), సౌందర్యం, సౌశీల్యం మూర్తీభవించిన యువతీయువకులు... ఇలాంటి పాత్రలే ఈ కథల్లో ఎక్కువగా దర్శనమిస్తాయి. అందుకే ఈ కథల్లో వాస్తవికత కంటే ఆదర్శమే ఎక్కువుందనిపిస్తుంది.
  సమాజంలో చెడు, కపటం, హింస, ప్రతికూల ఆలోచనా ధోరణి పెచ్చు పెరుగుతున్న ఈ కాలంలో ఈ రచయిత సృష్టించిన పాత్రలు, చెప్పిన కథలు అంత సమకాలీనంగా తోచవు. అయితే సాహిత్యమన్నది ప్రపంచం ఎలా ఉందో చూపడమే కాదు, ఎలా ఉండాలోకూడ చెప్పాలి అనుకుంటే, ఏ విధంగా చెప్పినా మంచిని చూపడమే సాహిత్య ప్రయోజనం అనుకుంటే ఈ కథలు ప్రయోజనకరమే అవుతాయి.
  ఈ సంకలనంలో కథ కాని కథ 'రంగుల కల'. ధ్యానం అన్నది మనిషి జీవితాన్ని ఎలా పరిపక్వం చేస్తుందో చెప్పే వ్యాసం వంటి కథ ఇది. అలాగే 'పరిహారం' కథ కూడా తాత్విక కోణం నుంచి చూసినపుడు మంచి కథ. ఈ కథలన్నిటిలోకీ విశిష్టమైన కథ 'పెరుమాళ్ల సాక్షిగా'. మనిషి తన పెంపుడు జంతువుగా ముద్దుచేయడమో, వీధి కుక్కగా విదిలించుకోవడమో చేసే శునకం ఆ మనుషులను ఎంత నిశితంగా గమనిస్తుందీ, వాళ్ల మంచి చెడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తుంది అని చెప్పే ఆసక్తికరమైన, మంచి కథ ఇది. మనిషిలోని కపటాన్ని చూసి బాధపడే కుక్క. వాళ్లతో మాట్లాడి వాళ్లు చేస్తున్న తప్పులను చెప్పి, మార్చడానికి ప్రయత్నించే పెద్దన్నలా ప్రవర్తిస్తుంది. కానీ, తన జోక్యం వల్ల పశువైన మనిషి ఇంకా పశువుగా మారుతున్నాడని గ్రహించి, మౌనిలా నిశ్శబ్దంగా బతకడం అలవాటు చేసుకుంటుంది. అలాంటి కుక్క చనిపోయినందుకు బాధపడుతూ కథకుడు మనతో ఆ కుక్కకూ, తనకూ జరిగిన సంభాషణను పంచుకుంటాడు.
  మానవ సంబంధాలపట్ల సానుకూల దృక్పథం, భాషపై చక్కని అధికారం ఉన్న రచయిత (తరానా అన్న కలం పేరుతో రాసిన రచయిత) సమకాలీన వాస్తవికతను చిత్రించే మంచి రచనలు చేయాలని నా ఆకాంక్ష. పాత్రల్లో ఆదర్శం ఎక్కువయ్యే కొద్దీ అవి సహజత్వానికి దూరమవుతాయి. సహజంగా లేని పాత్రలతో పాఠకుడికి తన్మయీభావం కలగదు. పాఠకుడు తనని తాను ఆ రచనలో చూసుకోకపోతే, ఆ కథ ప్రభావం కూడ అతనిపై ఏమాత్రం ఉండదు. అలాంటప్పుడు ఎంత చక్కని సందేశం ఇచ్చినా అది పాఠకుడిని చేరదు. ఈ కథల్లోని వస్తువును బట్టి చూస్తే, మానవ సంబంధాల్లో ఉన్న సంఘర్షణను, నిమ్నోన్నతాలనూ చిత్రించడానికి చాలా అవకాశం ఉంది. కానీ, రచయిత వాటిని పరిహరించి సమస్యలకు చాలా సుళువైన (సింప్లిస్టిక్‌) పరిష్కారాలను చూపించారు. ఉదాహరణకు 'మైథిలి-మౌనం' కథలో తల్లి కూతురితో తన ప్రేమ కథను విపులంగా చెప్పడం, కూతురు దాన్ని చాలా సహజంగా స్వీకరించి తన ఆమోదాన్ని తెలపడం-చదవడానికి బాగున్నా, అటువంటి సన్నివేశంలో కుమార్తెలో సహజంగా కనిపించాల్సిన సంఘర్షణ మచ్చుకైనా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి సుళువైన పరిష్కారాలు ఆదర్శపాత్రల వల్లే సాధ్యం. వాస్తవ పాత్రల వల్లకాదు. ఆధునిక సమాజంలోని మానవ సంబంధాల్లో తలెత్తే సమస్యలకు సుళువైన, సరళమైన పరిష్కారాలుండడం కష్టం. ఆవిషయాన్ని గుర్తించి నారాయణరావుగారు మరింత వాస్తవికంగా మరిన్ని మంచి కథలు రాస్తారని ఆశిస్తున్నాను.
  16.10.2016 -మృణాళిని
Read Book

పనామా బీచ్‌లో..

Publication Date: Sep 01, 2016

Publisher: ప్రగతి కేంద్ర ప్రచురణలు

Edition: 2016

Language: Telugu

Pages: 132

 
 
 
This is Terms and conditions page description
This is product content page description
This is privacy policy page description
The Publisher of this website makes every effort to be as accurate and complete as possible in the creation and curation of the content published on this site. However, Publisher does not warrant or represent at any time that the contents within are accurate due to the rapidly changing nature of the Internet. The Publisher will not be responsible for any losses or damages of any kind incurred by the reader whether directly or indirectly arising from the use of the information found on this website. The authors and Publisher reserve the right to make changes without notice. The Publisher assumes no responsibility or liability whatsoever on the behalf of the reader of this website. No part of the content available in the website may be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording or by any information storage and retrieval system, without written permission. This website is not intended for use as a source of legal, health, business, accounting or financial advice. All readers are advised to seek services of competent professionals in the legal, health, business, accounting, and finance fields. There are no representations or warranties, express or implied, about the completeness, accuracy, reliability, suitability or availability with respect to the information, products, services, or related graphics contained in this website for any purpose.